Search for:
  • Home/
  • Breaking/
  • వన్డేలు, టీ20ల్లో స్టాప్‌క్లాక్‌

వన్డేలు, టీ20ల్లో స్టాప్‌క్లాక్‌

– టీ20 ప్రపంచకప్‌లో రిజర్వ్‌డేలు
– ఐసీసీ కీలక నిర్ణయాలు

దుబాయ్‌: క్రికెట్‌లో త్వరలో కొత్త నిబంధనలు రాబోతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు లు చోటు చేసుకుంటున్నాయి. ఇక నుంచి వన్డేలు, టీ20ల్లో వృథా సమయాన్ని అరికట్టేందుకు ఐసీసీ స్టాప్‌క్లాక్‌ నిబంధనను తీసుకొచ్చింది. వెస్టిండీస్‌, అమెరికా వేదికలుగా జూన్‌ 1 నుంచి మొదలయ్యే టీ20 ప్రపంచకప్‌ నుంచి ఈ నిబంధన అధికారికంగా అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఒక ఓవర్‌ ముగిసిన వెంటనే 60 సెకన్ల వ్యవధిలో కొత్త ఓవర్‌ వేయాల్సి ఉంటుంది. 60 సెకన్ల వ్యవధిలో కొత్త ఓవర్‌ వేయని పిమ్మట ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ రెండు సార్లు వార్నింగ్‌ ఇస్తాడు. ఇలా నిబంధను ఉల్లంఘిస్తే..ఐదు పరుగుల పెనాల్టీ ఎదుర్కొవాల్సి వస్తుంది.

‘జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ నుంచి వన్డేలు, టీ20ల్లో స్టాప్‌ క్లాక్‌ నిబంధన పర్మినెంట్‌గా తీసుకొస్తున్నాం. ఏప్రిల్‌ వరకు ఈ ట్రయల్‌ కొనసాగుతున్నది. ఇప్పటికే ఈ నిబంధనను ప్రయోగాత్మకంగా వాడుతున్నాం. దీని ద్వారా వన్డేల్లో 20 నిమిషాల వరకు సమయం ఆదా అయ్యే అవకాశముంది’ అని ఐసీసీ వార్షిక బోర్డు మీటింగ్‌లో పేర్కొంది. ఇదిలా ఉంటే కొన్ని సందర్భాల్లో స్టాప్‌క్లాక్‌ నిబంధనకు మినహాయింపులు ఇచ్చారు. మరోవైపు మెగాటోర్నీలో సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డేలు ప్రకటించారు. భారత్‌, శ్రీలంక వేదికలుగా 2026లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు పోటీపడనున్నాయి.