Search for:

నేడే ‘ఫైనల్‌’

– ప్రొ కబడ్డీ లీగ్‌ టైటిల్‌ కోసం పుణేరి పల్టన్‌తో హరియాణా స్టీలర్స్‌ ‘ఢీ’

– రాత్రి గం. 8 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

 

మూడు నెలలుగా క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తోన్న ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌ ఆఖరి అంకానికి రంగం సిద్ధమైంది. గచ్చిబౌ లి ఇండోర్‌ స్టేడియంలో నేడు జరిగే ఫైనల్‌ పోరుతో పదో సీజన్‌కు తెర పడనుంది. తొలిసారి తుది సమరానికి చేరుకున్న హరియాణా స్టీలర్స్‌తో గత ఏడాది రన్నరప్‌ పుణేరి పల్టన్‌ అమీతుమీ తేల్చుకోనుంది. రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ ఫైనల్‌కు సంబంధించి టికెట్లన్నీ అమ్ముడుపోవడం విశేషం. ఇప్పటి వరకు తొమ్మిది సీజన్‌లు జరగ్గా… పుణేరి పల్టన్‌ రెండోసారి… హరియాణా స్టీలర్స్‌ తొలిసారి ఫైనల్‌ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అంతిమ సమరంలో ఏ జట్టు గెలిచినా తొలిసారి ప్రొ కబడ్డీ లీగ్‌ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడుతుంది.

ఈ లీగ్‌ చరిత్రలో ఇప్పటి వరకు పుణేరి పల్టన్, హరియాణా స్టీలర్స్‌ జట్లు ముఖాముఖిగా 14 సార్లు తలపడ్డాయి. 8 సార్లు పుణేరి జట్టు… 5 సార్లు హరియాణా జట్టు గెలుపొందాయి. ఒక మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది. తాజా సీజన్‌లో నిర్ణీత 22 లీగ్‌ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న పుణేరి జట్టు 17 మ్యాచ్‌ల్లో నెగ్గి, రెండింటిలో ఓడి, మూడింటిని ‘టై’ చేసుకొని 96 పాయింట్లతో ‘టాపర్‌’గా నిలిచి నేరుగా సెమీఫైనల్‌ చేరుకుంది. మరోవైపు హరియణా 70 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.

ఎలిమినేటర్‌–2లో గుజరాత్‌ జెయింట్స్‌ను ఓడించి, సెమీఫైనల్‌ చేరిన హరియాణా ఈ కీలక పోరులో 31–27తో డిఫెండింగ్‌ చాంపియన్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ను బోల్తా కొట్టించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. పుణేరి పల్టన్‌ తరఫున మోహిత్‌ గోయట్‌ ఈ సీజన్‌లో అత్యధికంగా 117 రెయిండింగ్‌ పాయింట్లు సాధించాడు. డిఫెన్స్‌ విభాగంలో మొహమ్మద్‌ రెజా 97 ట్యాకిల్‌ పాయింట్లు సంపాదించాడు.

పుణేరి పల్టన్‌ జట్టు కెపె్టన్‌ అస్లమ్‌ ఇనామ్‌దార్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో 164 పాయింట్లతో అదరగొట్టాడు. మరోవైపు హరియాణా స్టీలర్స్‌ రెయిడర్‌ వినయ్‌ ఏకంగా 160 పాయింట్లు కొల్లగొట్టాడు. డిఫెండర్‌ రాహుల్‌ 71 పాయింట్లు, కెపె్టన్‌ జైదీప్‌ 69 పాయింట్లతో ఆకట్టుకున్నారు.