Search for:
  • Home/
  • Breaking/
  • సత్తా చాటిన విశాఖ అమ్మాయి..

సత్తా చాటిన విశాఖ అమ్మాయి..

గుజరాత్‌ను గెలిపించిన షబ్నమ్‌ షకీల్‌

మహిళల ఐపీఎల్‌ (డబ్ల్యూపీఎల్‌) 2024 ఎడిషన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న గుజరాత్‌ జెయింట్స్‌కు విశాఖ బౌలర్‌ షబ్నమ్‌ షకీల్‌ బ్రేక్‌ ఇచ్చింది. యూపీ వారియర్జ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో షబ్నమ్‌ అద్భుత బౌలింగ్‌ ప్రదర్శనతో (4-0-11-3) ఆకట్టుకుంది. ఫలితంగా గుజరాత్‌ 8 పరుగుల తేడాతో వారియర్జ్‌ను ఓడించి సీజన్‌లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది.

షబ్నమ్‌ తన మీడియం పేస్‌ బౌలింగ్‌తో వారియర్జ్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. షబ్నమ్‌ దెబ్బకు వారియర్జ్‌ 4 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఆదిలోనే ఓటమిని ఖరారు చేసుకుంది. దీప్తి శర్మ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ మెరుపు అర్ధ సెంచరీతో (60 బంతుల్లో 88 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగినా వారియర్జ్‌ను గెలిపించలేకపోయింది. ఫలితంగా వారియర్జ్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్‌ బెత్‌ మూనీ (52 బంతుల్లో 74 నాటౌట్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడి హాఫ్‌ సెంచరీ సాధించగా, లారా వాల్‌వార్ట్‌ (30 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించింది. వారియర్జ్‌ బౌలర్లలో సోఫీ ఎకెల్‌స్టోన్‌ 3, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టారు.

లక్ష ఛేదనలో షబ్నమ్‌ దెబ్బకు ఆదిలోనే తడబడిన వారియర్జ్‌ దీప్తి శర్మ రాణించినా ఓటమిపాలైంది. వారియర్జ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. దీప్తితో పాటు పూనమ్‌ ఖేమ్నర్‌ (36 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడినా వారియర్జ్‌కు గెలిపించలేకపోయారు. చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా దీప్తి 2 సిక్సర్లు సహా 17 పరుగులు సాధించినప్పటికీ వారియర్జ్‌ లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ గెలిచినప్పటికీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమే అవుతుంది. ఢిల్లీ, ముంబై ఇండియన్స్‌ ఇదివరకే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. ఆర్సీబీ మరో బెర్త్‌ రేసులో ముందుంజలో ఉంది.

సత్తా చాటిన విశాఖ అమ్మాయి..
యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌లో సత్తా చాటిన షబ్నమ్‌ స్వస్థలం విశాఖపట్నం. 16 ఏళ్ల షబ్నమ్‌ డబ్ల్యూపీఎల్‌ బరిలోకి దిగిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. వేలంలో ఆమెను గుజరాత్‌ టీమ్‌ రూ. 10 లక్షలకు తీసుకుంది. తన తొలి మ్యాచ్‌లో వికెట్‌ దక్కకపోయినా చక్కటి బంతులతో ఆమె ఆకట్టుకుంది. ముంబైతో జరిగిన గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ నాట్‌ సివర్‌ బ్రంట్‌ను తొలి వికెట్‌గా అవుట్‌ చేసిన షబ్నమ్‌… ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చింది. గత ఏడాదే అండర్‌–19 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో షబ్నమ్‌ సభ్యురాలిగా ఉంది