Search for:
  • Home/
  • Breaking/
  • బజరంగ్, రవి దహియాలకు షాక్‌

బజరంగ్, రవి దహియాలకు షాక్‌

 - ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ నుంచి అవుట్‌

సోనెపట్‌ (హరియాణా): టోక్యో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన రవి దహియా… కాంస్య పతకం నెగ్గిన బజరంగ్‌ పూనియాలకు షాక్‌! పారిస్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోరీ్నల్లో బరిలోకి దిగే భారత జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్‌ ట్రయల్స్‌లో బజరంగ్‌ (65 కేజీలు), రవి (57 కేజీలు) అనూహ్యంగా ఓడిపోయారు. ఆదివారం నిర్వహించిన ట్రయల్స్‌లో సెమీఫైనల్లో బజరంగ్‌ 1–9తో రోహిత్‌ చేతిలో ఓడాడు.

ఫైనల్లో రోహిత్‌పై సుజీత్‌ కల్కాల్‌ గెలుపొంది ఆసియా, వరల్డ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో జరిగిన 57 కేజీల విభాగంలో తొలి బౌట్‌లో రవి దహియా 13–14తో అమన్‌ సెహ్రావత్‌ చేతిలో… రెండో బౌట్‌లో 8–10తో ఉదిత్‌ చేతిలో ఓడిపోయాడు. ఇతర ఒలింపిక్‌ వెయిట్‌ కేటగిరీల్లో జైదీప్‌ (74 కేజీలు), దీపక్‌ పూనియా (86 కేజీలు), దీపక్‌ నెహ్రా (97 కేజీలు), సుమిత్‌ మలిక్‌ (125 కేజీలు) విజేతలుగా నిలిచి భారత జట్టుకు ఎంపికయ్యారు. ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ ఏప్రిల్‌ 19 నుంచి 21 వరకు కిర్గిస్తాన్‌లో… వరల్డ్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ మే 9 నుంచి 12 వరకు ఇస్తాంబుల్‌లో జరుగుతాయి.